భూభారతి చరిత్రలో నిలిచి పోతుంది

Mallu Bhatti Vikramarka

 

  • రాష్ట్రంలో 4 భూ చట్టాలను కాంగ్రెస్సే తెచ్చింది
  • ధరణిలో భూమి లేక పోయినా పాసు బుక్కులు సృష్టించారు
  • ఆగస్టు15 నాటికి రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం
  • దశాబ్దాలుగా 413 గ్రామాలకు నక్సాలు, రికార్డులే లేవు
  • అందుకే గ్రామాల్లో రీ సర్వే చేపడుతున్నాం
  • 4 రోజుల్లో 3,556 మంది వీయార్వోలను నియామకం
  • 35 రోజుల్లో 6 వేల మంది లైసెన్సెడ్ సర్వేయర్ల ఏర్పాటు
  • నాట్లకు ముందే రైతుల ఖాతాల్లో భరోసా  నిధులు
  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల
  • ములుగుమాడులో భూ సర్వే, రెవెన్యూ సదస్సుల ప్రారంభం   

తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం చరిత్రలో నిలిచి పోతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇటువంటి చట్టాలు రావడం దేశంలోనే చాలా అరుదన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో అమలవుతున్న రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి, ఇక్కడి ప్రజలకు మేలు జరిగేలా ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఈ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంతో పాటు, ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కూడా దక్కుతుందన్నారు. మంగళవారం ఆయన ఫైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన ఎర్రుపాలెం మండలంలోని ములుగుమాడులో రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి భూభారతి అమలులో భాగంగా భూముల రీ సర్వేను, రెవెన్యూ సదస్సులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ నక్షాలు, రికార్డులు లేకుండా రాష్ట్రంలో 413 గ్రామాలలో దశాబ్దాల కాలంగా పాలన సాగుతోందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కష్టాలు పడుతున్నారని, భూ భారతి చట్టం ద్వారా 413 గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సర్వే చేయించి, సరిహద్దులను నిర్ణయించి, ఇబ్బందులు లేకుండా చేయాలని పైలెట్ ప్రాజెక్టు క్రింద ఈ ములుగుమాడు గ్రామాన్ని ఎంపిక చేసామని తెలిపారు. ఈ రాష్ట్రంలో1950 టెనెస్సీ మరియు లాండ్ రికార్డ్స్ యాక్టు, 1971 ఆర్ఓఆర్ చట్టం, 1973 లాండ్ రిఫార్మ్స్ యాక్టులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వాలు తెచ్చిన ఈ చట్టాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. కానీ గత ప్రభుత్వం 2020 లో తీసుకొచ్చిన దుర్మార్గమైన ధరణి చట్టం వల్ల గందరగోళం ఏర్పడిందన్నారు. దీంతో సమస్యలు మొదలై, రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకొని, రైతుల హక్కులను కాలరాస్తూ కొన్ని వేల ఎకరాలను అక్రమంగా కొంత మంది పేరు మీద ఎక్కించుకున్నారని ఆరోపించారు. వాస్తవంగా వున్న భూమికి మించి పాసు పాసుపుస్తకాలు ఇచ్చారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిన భూములకు సైతం పాసు పుస్తకాలు ఇవ్వకుండా పార్ట్ బి లో పెట్టారని తెలిపారు. రైతులు రికార్డుల్లో తప్పులను సరిచేసుకొనే అవకాశమే లేకుండా చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇచ్చిన మాట ప్రకారం, గత ప్రభుత్వం తెచ్చిన ధరణిని బంగాళాఖాతంలో వేసి, రైతులకు మేలు చేసే భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు. ఇది రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. అందుకే, భూ సమస్యలను పరిష్కరించేందుకు నేటి నుండి ( మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సుల్లో రైతుల భూ సమస్యలన్నీ పరిష్కారమవుతావని అన్నారు. భూభారతి చట్టం ప్రకారం, ప్రతి ఏటా గ్రామాలలో  రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూమి అమ్మకాల, కొనుగోలుకు సంబంధీచిన వివరాలను అప్ డేట్ చేస్తూ, భూ రికార్డులను మాన్యువల్గా రాసి పంచాయతీ కార్యాలయంలో అతికిస్తామన్నారు. గత ప్రభుత్వం, నియోజక వర్గ స్థాయిలో వుండే అస్సైన్మెంట్ కమిటీలను కూడా నిర్వీర్యం చేసిందన్నారు. గడిచిన పదేళ్ళలో ఆ కమిటీ సమావేశాలే జరప లేదన్నారు. అయితే, తమ ప్రభుత్వం అస్సైన్మెంట్ కమిటీలను పునరుద్దరిస్తుందని, క్రమం తప్పకుండా కమిటీ సమావేశాలు నిర్వహిస్తుందని భట్టి ఈ సందర్భంగా తెలిపారు.


Ponguleti Srinivas Reddy

ఆగస్టు 15 నాటికి భూ సమస్యలన్నీ పరిష్కారం : మంత్రి పొంగులేటి

ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో భూసమస్యలన్నీ పరిష్కారమవుతాయని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆన్నారు. రైతులు ధరఖాస్తులో తమ భూ సమస్యపై టిక్ చేస్తే చాలు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్ట కుండా సమస్య పరిష్కారమై పోతుందని చెప్పారు. తమ ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం వల్ల, ధరణి కష్టాలు తొలగి పోయి, రైతుల హక్కులకు, భూమికి రక్షణ కలుగుతుందన్నారు. భూభారతి అమలులో భాగంగా నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వేతో పాటు రెవెన్యూ సదస్సులు కూడా జరుపుతున్నామన్నారు. మరో 3, 4 రోజుల్లో 3,556 మంది వీయార్వోలను నియమిస్తున్నట్లు వెల్లడించారు. భూముల రీ సర్వేకు ఫైలెట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో ఐదు గ్రామాలను మొదటి విడత ఎంపిక చేశామన్నారు. ఈ గ్రామాల్లో ఐదు ప్రముఖ కంపెనీలతో భూముల రీ సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు. రెండు పద్దతుల్లో ఈ సర్వే జరుతుందని, ఏ పద్దతిలో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయో, ఆ పద్దతిని రాష్ట్ర వ్యాప్త సర్వేకు ఎంచుకుంటామన్నారు. ఈ ఫైలెట్ ప్రాజెక్ట్ గ్రామాల్లో డ్రోన్, గ్రౌండ్ మెథడ్లో సర్వే చేపడుతున్నామని పేర్కొన్నారు. అలాగే, మరో 35 రోజుల్లో 6000 మంది లైసెన్సెడ్ సర్వేయర్లను నియమించబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వీరందరూ శిక్షణ పొందుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పుణ్యమాని, ఇందిరా గాంధి హయాంలో పేదలకు పంచిన భూమి, రికార్డుల్లో తారుమారైందన్నారు. భూమి లేక పోయినా, లక్షల ఎకరాలకు అధనంగా పాసు పుస్తకాలు ఇచ్చారని ఆరోపించారు. వీటన్నిటినీ పరిశీలించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. భూముల విషయంలో, భవిష్యత్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా రిజిష్ట్రేషన్ సమయంలోనే ఆయా భూ కమతాలకు సంబంధించి మ్యాపులు జత చేస్తామన్నారు. ఇప్పటికే రిజిష్ట్రేషన్ ప్రక్రియలో కూడా పారదర్శకతను తీసుకొచ్చామని చెప్పారు. అంతే కాకుండా, భూ సర్వేను పూర్తి చేసి కమతానికి ఒక భూధార్ నెంబర్ ఇస్తామన్నారు. దీని వల్ల అక్రమాలకు తావు లేకుండా పోతుందని, కొనుగోళ్ళు, అమ్మకాలు కూడా సాఫీగా జరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో తమ ప్రభుత్వం ఆదే చేస్తుందని, ప్రజలెవరూ అభద్రతకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.


Thummala Nageswara Rao

నాట్లకు ముందే రైతు భరోసా : మంత్రి తుమ్మల

వరి నాట్లకు ముందే రైతు భరోసా కింద రైతులకు డబ్బులు జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. రైతులకు ఒకే సంవత్సరంలో 36 వేల కోట్ల రూపాయలను నేరుగా అందించామని తెలిపారు. పాసు పుస్తకాల్లో వున్న తప్పుల వల్ల రైతులు చాలా ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. చాలా గ్రామాల్లో తక్కువ విస్తీర్ణంలో వున్న భూమికి కూడా వేల ఎకరాలు వున్నట్లు పాసు పుస్తకాలు సృష్టించారని, దీని వల్ల ప్రభుత్వంపై కూడా భారం పడుతుందని పేర్కొన్నారు. భూముల ధరలు పెరిగి పోవడం వల్ల అన్నదమ్ములు, స్నేహితుల మధ్య కూడా గొడవలు పెరిగి హత్యల వరకు దారి తీస్తున్నాయని, వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని చెప్పారు. భూముల రికార్డులు సక్రమంగా నిర్వహించేందుకు రైతులు, భూ యాజమానుల నుంచి టోకెన్ అమౌంట్ సేకరించాలని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత క్రింద ప్రభుత్వం 4 లక్షల 50 వేల ఇండ్లను మంజూరు చేసిందని, వీటికి గుడిసెలల్లో ఉండే పేదలను ఎంపిక చేయాలని సూచించారు. ఒక అనర్హుడికి ఇండ్లు కేటాయించినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. దేశంలో శాంతి భద్రతలు మన తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతంగా ఉన్నాయని, ప్రజా ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులను సాధించిందని, ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతుందని తుమ్మల పేర్కొన్నారు. అనంతరం భట్టి, పొంగులేటి, తుమ్మల సర్వే పరికరాల పని తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జేడీ ప్రసన్న లక్ష్మీ, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకుబ్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాసులు, ఎర్రుపాలెం తహసీల్దార్ ఉషా శారద తదితరులు పాల్గొన్నారు.


Bhubhaarathi

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి